గోవింద నామస్మరణతో వెంకటేశ్వర స్వామికి 108 కలశాలతో అభిషేకం

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రవణ నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని 108 కలశాలతో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఘనంగా అభిషేకాలు నిర్వహించారు.

గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగగా.. ప్రధాన అర్చకులు డింగరి హరికృష్ణ ఆచార్యులు వేదమంత్రాల నడుమ స్వామివారికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం 108 కలశాలను ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

అభిషేకాల అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. అందంగా అలంకరించిన స్వామివారిని దర్శించుకున్న భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. గోవింద నామస్మరణ, వేదమంత్రోచ్ఛారణలతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.