iPhone 18 Pro Max: అదిరిపోయే అప్‌గ్రేడ్స్‌తో ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్.. లీకైన ఫీచర్లు ఇవే!

ఆపిల్ తన తదుపరి తరం ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల శ్రేణి ‘ఐఫోన్ 18 ప్రో’ సిరీస్‌ను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా.. సెప్టెంబర్ 9న నిర్వహించనున్న ఈవెంట్‌లో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌తో పాటు సరికొత్త ఐఫోన్ ఫోల్డ్, కొత్త ఆపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ మోడళ్లను పరిచయం చేసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు వెలువడిన లీక్‌లను పరిశీలిస్తే.. ఈసారి ప్రో సిరీస్‌లో డిజైన్‌తో పాటు పనితీరు, బ్యాటరీ, కనెక్టివిటీ విషయంలోనూ భారీ అప్‌గ్రేడ్లు ఉండే అవకాశం కనిపిస్తోంది. డార్క్ చెర్రీ, లైట్ బ్లూ, సిల్వర్ వంటి కొత్త రంగుల్లో ఫోన్లు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. వెనుక డిజైన్, ఫ్లాట్ ఎడ్జెస్‌లో పెద్దగా మార్పులు లేకపోయినా.. ముందు భాగంలోని డైనమిక్ ఐలాండ్ పరిమాణం కొంత తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఐఫోన్ 18 ప్రో సిరీస్‌లో అత్యంత కీలకమైన అప్‌గ్రేడ్‌గా A20 ప్రో చిప్‌సెట్ నిలవనుంది. TSMC అత్యాధునిక 2nm ప్రాసెస్, గేట్-ఆల్-అరౌండ్ (GAA) టెక్నాలజీ ఆధారంగా ఈ చిప్‌ను తయారు చేస్తున్నట్లు లీక్‌లు సూచిస్తున్నాయి. మునుపటి A19 ప్రోతో పోలిస్తే దాదాపు 18 శాతం వేగవంతమైన పనితీరు, 30 శాతం వరకు తక్కువ విద్యుత్ వినియోగాన్ని అందించే అవకాశం ఉందని సమాచారం. దీంతో బ్యాటరీపై అధిక భారం పడకుండా AI ఫీచర్లు, హై-ఎండ్ గేమింగ్, ఇతర క్లిష్టమైన టాస్క్‌లను మరింత సమర్థవంతంగా నిర్వహించే వీలుంటుంది.

బ్యాటరీ, కనెక్టివిటీ విషయంలోనూ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో గణనీయమైన మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. లీక్‌ల ప్రకారం.. eSIM మోడల్‌లో 5,425mAh, ఫిజికల్ SIM మోడల్‌లో 5,235mAh బ్యాటరీ అందించే అవకాశం ఉంది. ఇది ప్రస్తుత తరం ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌తో పోలిస్తే దాదాపు 10 శాతం పెరుగుదలగా చెప్పొచ్చు. మరోవైపు క్వాల్‌కామ్‌పై ఆధారాన్ని తగ్గించే దిశగా ఆపిల్ సొంతంగా అభివృద్ధి చేసిన C2 మోడెమ్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. మెరుగైన సిగ్నల్ కనెక్టివిటీతో పాటు తక్కువ విద్యుత్ వినియోగం ద్వారా బ్యాటరీ లైఫ్‌ను పెంచడంలో ఇది కీలక పాత్ర పోషించవచ్చని అంచనా. అయితే ఇవన్నీ ప్రస్తుతం లీకులు, అంచనాల ఆధారంగానే ఉన్నందున.. అధికారిక ప్రకటన వచ్చే వరకు పూర్తి వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.