నేపాల్లోని రసువా జిల్లాను బుధవారం ఉదయం సంభవించిన భారీ వరదలు అతలాకుతలం చేశాయి. భోటేకోషి నది ఒక్కసారిగా ఉప్పొంగడంతో నదీ పరివాహక ప్రాంతంలోని గ్రామాలు క్షణాల్లోనే జలమయమయ్యాయి. వరద ప్రవాహం తీవ్రంగా ఉండటంతో నదీ తీర ప్రాంతాల్లోని ఇళ్లు, జనావాసాలు కొట్టుకుపోయాయి. ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి పరిస్థితి ఎంత భయానకంగా ఉందో స్పష్టం చేస్తున్నాయి.
ఈ వరదల కారణంగా రసువా జిల్లాలోని పలు కీలక ప్రాంతాలు, మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉత్తరగయ గ్రామీణ మునిసిపాలిటీ ఉపాధ్యక్షురాలు చమేలీ గురుంగ్ తెలిపిన వివరాల ప్రకారం.. స్యాఫ్రూబెసి, బెట్రావతి, మైలుంగ్, సల్లెతార్, శాంతిబజార్, పైరేబెసి, ఖాల్తీ బస్తీ, సోలే, త్రిశూలి, బట్టార్ తదితర డజనుకు పైగా గ్రామాలు వరద ప్రభావానికి గురయ్యాయి. పలు ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు, ఇతర మౌలిక వసతులు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ విపత్తులో భారీగా ప్రాణనష్టం సంభవించి ఉండొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు 13 మృతదేహాలను వెలికితీసినట్లు సమాచారం. వెయ్యి మందికి పైగా వరద ప్రవాహంలో గల్లంతై ఉండొచ్చని స్థానికులు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. అయితే మరణాలు, గాయపడినవారు, ఆస్తి నష్టానికి సంబంధించిన అధికారిక గణాంకాలను ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య, నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.