దేశంలో చక్కెర ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన చక్కెర ధరలకు కేంద్రం తీసుకున్న సత్వర నిర్ణయాలతో బ్రేక్ పడింది. ప్రభుత్వ చర్యల ఫలితంగా చక్కెర ఎక్స్-మిల్ ధరలు ఏకంగా 18 శాతం మేర తగ్గాయి. దీంతో ప్రస్తుతం మిల్లుల వద్ద కిలో చక్కెర ధర రూ.55కు దిగివచ్చింది. రాబోయే రోజుల్లో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా వెల్లడించారు.
గడిచిన 15 రోజుల్లో దేశీయ మార్కెట్‌లో చక్కెర ధరలు అనూహ్యంగా పెరిగాయి. మిల్లుల వద్ద ఎక్స్-మిల్ ధర కిలోకు రూ.67 వరకు చేరింది. సుగర్ మిల్లులు ఏకపక్షంగా ధరలను పెంచడమే ఈ ఆకస్మిక పెరుగుదలకు ప్రధాన కారణమని సంజీవ్ చోప్రా తెలిపారు. మిల్లుల వద్ద ధరలు పెరగడంతో దాని ప్రభావం హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లపైనా పడింది. దీంతో వినియోగదారులపై అదనపు భారం పడింది.
ధరలు రికార్డు స్థాయికి చేరడంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టింది. మార్కెట్‌లో సరుకు కొరత ఏర్పడకుండా సరఫరాను పెంచేందుకు చక్కెర దిగుమతులకు తక్షణ అనుమతి ఇచ్చింది. దీంతోపాటు ధరల నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టింది. కేంద్ర నిర్ణయాల ప్రభావంతో ఇప్పటికే చక్కెర ధరలు తగ్గుముఖం పట్టగా, రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.