వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 52 మంది అత్యున్నత స్థాయి రాజకీయ నాయకులకు ప్రత్యేకంగా బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లను కేటాయించింది. ఎన్నికల సమయంలో భద్రతా ముప్పులను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
ఈ భద్రతా కవచం పొందిన వారిలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేష్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ (BSP) సుప్రీమో మాయావతితో పాటు పలువురు కీలక నేతలు ఉన్నారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. ఒక్కో బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఈ జాకెట్ల కేటాయింపు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మొదటి విడతలో 8 మంది నేతలకు, రెండో విడతలో మరో 44 మందికి బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లను పంపిణీ చేసినట్లు సమాచారం. ఎన్నికల నేపథ్యంలో కీలక నేతల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యూపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పరిణామాలతో పాటు భద్రతా ఏర్పాట్లు కూడా మరింత కీలకంగా మారుతున్నాయి.