భారతీయ చిత్రసీమలో తనదైన విలక్షణ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సీనియర్ నటి ‘షావుకారు’ జానకి కన్నుమూశారు. 94 ఏళ్ల వయసులో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఏడు దశాబ్దాలకు పైగా సాగిన తన సినీ ప్రస్థానంలో షావుకారు జానకి ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలం నుంచి నేటి తరం చిత్రాల వరకు దాదాపు 400 సినిమాల్లో నటించి, తన సహజ నటనతో అశేష అభిమానులను సంపాదించుకున్నారు.
షావుకారు జానకి భౌతికంగా దూరమైనప్పటికీ.. ఆమె పోషించిన పాత్రలు, నటన, సినీ సేవలు ఎప్పటికీ ప్రేక్షకుల జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. భారతీయ సినిమా చరిత్రలో ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. ఆమె మృతి సినీ రంగానికి తీరని లోటుగా సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.