రాజమండ్రిలో సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రియాంక హత్య కేసులో నిందితుల రిమాండ్‌ను రాజమహేంద్రవరం జిల్లా కోర్టు మరోసారి పొడిగించింది. ఈ కేసులో నిందితులు సూరవరపు దస్వంత్, జోసెఫ్ ఎడ్వర్డ్స్‌ల పోలీస్ కస్టడీ ముగియడంతో పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచారు.
పోలీస్ కస్టడీ సమయంలో దర్యాప్తు అధికారులు నిందితులను పలుమార్లు విచారించి, కేసుకు సంబంధించిన పలు కీలక అంశాలపై సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. కస్టడీ గడువు పూర్తికావడంతో నిందితులను న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టగా.. కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో రిమాండ్‌ను మరో 14 రోజులు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు ఆదేశాల అనంతరం నిందితులను కట్టుదిట్టమైన భద్రత నడుమ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ హత్య కేసులో దర్యాప్తు అధికారులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. దర్యాప్తు పూర్తయ్యే కొద్దీ మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.