పోలవరం జిల్లా చింతూరు మండలం బొడ్డుగూడెం–విద్యానగరం గ్రామాల మధ్య జాతీయ రహదారి 30పై శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఎదురెదురుగా ఢీకొనడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు సజీవ దహనం కాగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
భద్రాచలం నుంచి ఇద్దరు వ్యక్తులు కారులో చింతూరు వైపు వస్తుండగా, ఒడిశా రాష్ట్రం నుంచి చింతూరు మీదుగా భద్రాచలం వైపు ఓ లారీ వెళ్తోంది. బొడ్డుగూడెం–విద్యానగరం గ్రామాల మధ్య జాతీయ రహదారి 30పై ఉన్న మూలమలుపు వద్ద రెండు వాహనాలు ఢీకొన్నాయి.
ప్రమాదం ధాటికి కారులో మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.