Sergio Gor: జమ్మూ కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం.. అమెరికా రాయబారి కీలక వ్యాఖ్యలు

 

భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ జమ్మూ కాశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. బుధవారం శ్రీనగర్‌ను సందర్శించిన ఆయన.. ‘‘జమ్మూ కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం’’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఒక అమెరికా రాయబారి కాశ్మీర్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.

శ్రీనగర్ చేరుకున్న అనంతరం సెర్గియో గోర్ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను కలిశారు. ఈ సమావేశంలో కాశ్మీర్ అభివృద్ధి, ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించడం వంటి అంశాలపై చర్చించినట్లు సెర్గియో గోర్ ఎక్స్‌లో పేర్కొన్నారు.

15 ఏళ్ల తర్వాత అమెరికా రాయబారి, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మధ్య జరిగిన తొలి ప్రత్యక్ష సమావేశం ఇదే. 2011లో అప్పటి అమెరికా రాయబారి తిమోతీ రోమర్, ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఒమర్ అబ్దుల్లాను కలిశారు.

ఈ సమావేశంపై ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. కాశ్మీర్ సమస్యలను అమెరికా పరిష్కరించలేదని, ఈ సమస్యకు కేంద్ర ప్రభుత్వమే పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు.