ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్టోబర్ చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో సమావేశాలు నిర్వహిస్తోందని వివరించారు. ఓటర్ల జాబితాను సిద్ధం చేసి, ఖరారు చేయాలని ఎస్ఈసీ ప్రభుత్వాన్ని కోరినట్లు కోర్టుకు తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కొన్ని చట్టాల్లో ప్రభుత్వం సవరణలు చేస్తోందని ఏజీ వెల్లడించారు. ఈ సవరణలను అసెంబ్లీ ముందు ప్రవేశపెట్టి ఆమోదం పొందే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు ప్రభుత్వం మరింత సమయం కోరింది. దీంతో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై తదుపరి విచారణలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. నివేదికను పరిశీలించిన అనంతరం రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని జీవో జారీ చేస్తుందని ఏజీ కోర్టుకు వివరించారు. ప్రభుత్వం నిర్ణయం వెల్లడించిన తర్వాత కమిషన్ నివేదికను ప్రజల ముందుకు తీసుకువస్తామని తెలిపారు.