AP Municipal Elections: 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు.. బీసీలకు 33.33% రిజర్వేషన్లు

 

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో రాష్ట్ర ఎన్నికల సంఘంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, వీటిలో 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే ప్రక్రియపై ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం.

ఇప్పటికే రాష్ట్రంలోని 87 మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం పూర్తయింది. మరో 13 పట్టణ స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు నవంబర్‌లో ముగియనుంది. దీంతో ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియలో అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది.

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘంతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఓటర్ల జాబితా, పరిపాలనా ఏర్పాట్లు, రిజర్వేషన్ల అమలు తదితర అంశాలపై అధికారులు చర్యలు చేపట్టనున్నారు. అయితే ఎన్నికల షెడ్యూల్, పోలింగ్ తేదీలను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. దీంతో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి త్వరలో ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.