కోర్టు ఆదేశాల అమలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వివిధ కేసుల్లో కౌంటర్లు, స్థాయి నివేదికలు, మెమోలు సమర్పించాలని ఆదేశించినప్పటికీ.. విచారణకు ముందు రోజు లేదా విచారణ జరిగే రోజే వాటిని దాఖలు చేస్తున్నారని ధర్మాసనం పేర్కొంది. కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవడం సరికాదని, నిర్దేశించిన గడువులోగా అవసరమైన వివరాలను సమర్పించాలని స్పష్టం చేసింది.
కౌంటర్లు, నివేదికలు దాఖలు చేయడంలో జాప్యం చేస్తున్న అధికారుల విషయంలో ఉదారంగా వ్యవహరించవద్దని అడ్వొకేట్ జనరల్‌కు హైకోర్టు సూచించింది. అధికారులు కోర్టు ఆదేశాలను గౌరవించేలా చర్యలు తీసుకోవాలని, సమయానికి నివేదికలు సమర్పించేలా చూడాలని పేర్కొంది. అయితే అధికారులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని భావించవద్దని ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వివరించినప్పటికీ.. సకాలంలో నివేదికలు అందకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.
మరోవైపు పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపైనా హైకోర్టు విచారణ చేపట్టింది. పోలీసుల సంక్షేమానికి సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పరిశీలించేందుకు హైకోర్టు సుమోటోగా నమోదు చేసిన పిటిషన్‌పైనా విచారణ జరిగింది. రెండు కేసుల్లోనూ సంబంధిత వివరాలతో నివేదికలు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. నివేదికల దాఖలుకు ప్రభుత్వం మరింత సమయం కోరడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు.. ఇకపై ఇలాంటి జాప్యాలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.