మారుతున్న నేర స్వభావం, ప్రజా భద్రతకు ఎదురవుతున్న కొత్త సవాళ్లకు అనుగుణంగా తెలంగాణ పోలీసు శాఖలో మానవ వనరులను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. గతంలో వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాదం ప్రధాన సవాళ్లుగా ఉండగా.. ప్రస్తుతం డ్రగ్స్, సైబర్ నేరాలు, ఆన్లైన్ బెట్టింగ్, పెట్టుబడి మోసాలు, ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత, ఆహార కల్తీ వంటి అంశాలు పోలీసులకు కొత్త సవాళ్లుగా మారాయని చెప్పారు. ఈ క్రమంలో గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఎస్ఐబీ తదితర ప్రత్యేక విభాగాల నుంచి 513 మంది సిబ్బందిని ఎనిమిది విభాగాలకు కేటాయించారు.
కొత్తగా కేటాయించిన వారిలో 5 మంది ఇన్స్పెక్టర్లు, 22 మంది ఎస్ఐలు, 14 మంది ఏఎస్ఐలు, 84 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 388 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. అత్యధికంగా 224 మందిని ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్డు భద్రత విభాగానికి కేటాయించారు. ఆహార కల్తీ, డ్రగ్ కంట్రోల్‌కు 80 మంది, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు 79 మంది, సివిల్ సప్లయిస్‌కు 28 మంది, డీజీపీ కార్యాలయం–టీ-స్పార్క్‌కు 27 మంది, ఏసీబీ, సీఐడీ, సైబర్ సెక్యూరిటీ బ్యూరోలకు 25 మంది చొప్పున కేటాయించారు. కొత్త బాధ్యతలకు ముందు సిబ్బందికి రెండు నెలల అటాచ్మెంట్, అనంతరం 11 రోజుల ప్రత్యేక శిక్షణ అందించినట్లు డీజీపీ తెలిపారు.
మరోవైపు యువతలో డ్రగ్స్ వినియోగం, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు ప్రధాన ఆందోళనకర అంశాలుగా మారాయని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. గత ఏడాది 835 మంది విద్యార్థుల్లో డ్రగ్స్ ఆనవాళ్లు గుర్తించినట్లు తెలిపారు. సైబర్ నేరాల కారణంగా తెలంగాణలో సుమారు రూ.1,750 కోట్ల ఆర్థిక నష్టం జరిగినట్లు చెప్పారు. అలాగే రోడ్డు ప్రమాదాల్లో గత ఏడాది సుమారు 8 వేల మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణ, డ్రగ్స్, సైబర్ నేరాలపై మరింత సమర్థంగా పనిచేసేందుకు తాజా పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు స్పష్టం చేశారు.