హైదరాబాద్‌లోని ప్రత్యేక పోక్సో కోర్టు వ్యభిచార ముఠా నిర్వహణ, మైనర్ బాలికలపై లైంగిక దాడులు, అక్రమ రవాణాకు సంబంధించిన 2015 నాటి కేసులో కీలక తీర్పు వెలువరించింది. మొత్తం 45 మంది నిందితుల్లో 33 మందిని దోషులుగా నిర్ధారించిన ప్రత్యేక సెషన్స్ కోర్టు.. ఐదుగురు ప్రధాన నిందితులకు జీవిత ఖైదు విధించింది. మరో ముగ్గురికి 14 ఏళ్లు, 14 మందికి 10 ఏళ్లు, 11 మందికి మూడేళ్ల చొప్పున కఠిన కారాగార శిక్ష విధించింది.
ఈ కేసులో సీఐడీ పోలీసులు 38 మంది బాధితులను రక్షించగా, వారిలో తొమ్మిది మంది మైనర్ బాలికలు ఉన్నారు. బాధితులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.45 లక్షల పరిహారం అందించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2015 జూలై 17న ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఆమెను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి బలవంతంగా వ్యభిచారంలోకి దించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన సీఐడీ ప్రత్యేక బృందాలు వ్యభిచార కేంద్రాలపై దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు బాధితులను రక్షించాయి. పకడ్బందీ దర్యాప్తుతో ఆధారాలు సేకరించి ఛార్జ్‌షీట్ దాఖలు చేయడంతో న్యాయస్థానం నిందితులకు కఠిన శిక్షలు ఖరారు చేసింది. కేసు దర్యాప్తులో అధికారులు, కోర్టులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసిన కృషిని అధికారులు ప్రశంసించారు.