Amaravati: కృష్ణానదిలో ముసలి కలకలం.. మత్స్యకారులు, నదిలోకి వెళ్లేవారికి అధికారుల హెచ్చరిక

అమరావతి ప్రాంతంలో కృష్ణానది తీరాన ముసలి కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. తాళ్లాయపాలెం శివక్షేత్రం సమీపంలో పలువురు ముసలిని గుర్తించినట్లు సమాచారం. నదిలో ముసలి సంచరిస్తున్నట్లు తెలియడంతో స్థానికులు, భక్తులు అప్రమత్తమయ్యారు.

కృష్ణానదిలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు, నదిలో ఈతకు వెళ్లే వారు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా ముసలి కనిపించిన ప్రాంతానికి సమీపంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.

ముసలి కదలికలను గుర్తించేందుకు అధికారులు పరిస్థితిని పరిశీలిస్తున్నారు. నదిలోకి వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని స్థానికులకు సూచించారు.