Parvathipuram: పార్వతీపురం మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం.. రూ.86.14 కోట్లతో నూతన తాగునీటి పథకం

పార్వతీపురం మున్సిపాలిటీ ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న మంచినీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం చూపేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా యూఐడీఎఫ్ (UIDF) పథకం కింద నూతన తాగునీటి సరఫరా పథకానికి అంచనాలు మంజూరైనట్లు వెల్లడించారు.

ఈ పథకాన్ని రూ.86.14 కోట్ల అంచనా వ్యయంతో, 13.50 MLD సామర్థ్యంతో చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో భాగంగా పార్వతీపురంలోని బెలగాం ట్యాంక్ వద్ద 500 KL సామర్థ్యం కలిగిన సర్వీస్ రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సరఫరా వ్యవస్థ మరింత మెరుగుపడనుంది.

దశాబ్దాలుగా కొనసాగుతున్న మంచినీటి సమస్యకు ఈ పథకం ద్వారా పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు నిరంతరంగా, నాణ్యమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రాజెక్టు పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను సూచించారు.