Annapurna Grain ATM: ఇక రేషన్ షాపుల వద్ద క్యూలు అక్కర్లేదు.. ATMలోనే బియ్యం డ్రా!

రేషన్ దుకాణాల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడే రోజులకు చెక్ పెట్టేలా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘అన్నపూర్ణ గ్రెయిన్ ఏటీఎం’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ ద్వారా ప్రజలు తమకు కేటాయించిన బియ్యాన్ని ఏటీఎం తరహాలో సులభంగా పొందవచ్చు. ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెంచడంతో పాటు, లబ్ధిదారులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ విధానాన్ని తీసుకొచ్చారు.

గ్రెయిన్ ఏటీఎం నుంచి బియ్యం పొందే ప్రక్రియ కూడా చాలా సులభంగా ఉంటుంది. ముందుగా ఏటీఎం మిషన్ స్క్రీన్‌పై ఆధార్ నంబర్ లేదా రేషన్ కార్డు నంబర్ నమోదు చేయాలి. అనంతరం స్క్రీన్‌పై కనిపించే వివరాలను పరిశీలించి, వేలిముద్ర లేదా ఐరిస్ స్కానింగ్ ద్వారా గుర్తింపు ధృవీకరణ పూర్తి చేయాలి. వెరిఫికేషన్ విజయవంతమైన తర్వాత లబ్ధిదారుడికి కేటాయించిన బియ్యం పరిమాణం ఆటోమేటిక్‌గా మిషన్ నుంచి బయటకు వస్తుంది.

ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా ఆటోమేటిక్‌గా పనిచేసే ఈ వ్యవస్థ రేషన్ పంపిణీలో సమయాన్ని ఆదా చేయడంతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట వేయడంలో కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. ముఖ్యంగా రేషన్ కోసం దుకాణాల వద్ద ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేకపోవడం లబ్ధిదారులకు పెద్ద సౌకర్యంగా మారనుంది. ఈ తరహా సాంకేతికతను మరింత విస్తరిస్తే ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత వేగవంతంగా, పారదర్శకంగా మారే అవకాశం ఉంది.