Bengaluru Crime: ఇంటి బాత్రూమ్‌లో మహిళ అస్థిపంజరం.. ఏడాదిన్నరగా మృతదేహం గుర్తించని వైనం!

బెంగళూరులో దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. హవనూర్ లేఅవుట్‌లోని ఓ ఇంటి బాత్రూమ్‌లో 50 ఏళ్ల మహిళ అస్థిపంజరం కనిపించింది. ఆమె సుమారు ఏడాదిన్నర క్రితమే మృతి చెంది ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఒంటరిగా జీవిస్తున్న ఆమె మరణం ఇంతకాలం వెలుగులోకి రాకపోవడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. మృతురాలిని దాక్షాయిణిగా పోలీసులు గుర్తించారు. ఉత్తర బెంగళూరులోని బాగలగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగస్టు 7న ఈ ఘటన బయటపడింది.

ఒంటరిగానే జీవనం.. తలుపు తెరిచి ఉండటంతో వెలుగులోకి..

పోలీసుల వివరాల ప్రకారం దాక్షాయిణి కొన్నేళ్లుగా ఒంటరిగా జీవిస్తున్నారు. ఆమె భర్త ఉమేశ్ సుమారు పదేళ్ల క్రితమే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆమె కుమారుడు కూడా అనారోగ్యంతో మృతి చెందినట్లు వెల్లడించారు. దాదాపు రెండేళ్లుగా ఆమె కుటుంబ సభ్యులతో ఎలాంటి సంబంధాలు లేవని పోలీసులు పేర్కొన్నారు.

ఆగస్టు 7న రాత్రి సుమారు 8 గంటల సమయంలో దాక్షాయిణి ఇంటి తలుపు తెరిచి ఉండటాన్ని స్థానికులు గమనించారు. ఇంట్లో దొంగతనం జరిగి ఉండొచ్చని అనుమానించిన వారు వెంటనే అత్యవసర నంబర్ 112కు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఇంటిని పరిశీలించగా బాత్రూమ్‌లో అస్థిపంజర అవశేషాలు కనిపించాయి. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె మరణానికి గల అసలు కారణం, అస్థిపంజరం అక్కడికి ఎలా చేరిందనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.