రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భవిష్యత్తులో నాటో కూటమిలోని ఏదో ఒక సభ్యదేశంపై దాడికి ప్రయత్నించే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. నాటో కూటమి ఐక్యతను పరీక్షించేందుకు రష్యా ఇలాంటి చర్యకు పాల్పడే అవకాశం ఉందని అమెరికా అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ దాడి సైబర్ దాడులు, రహస్య ఆపరేషన్లు లేదా నాటో తూర్పు సరిహద్దులో పరిమిత స్థాయి సైనిక చొరబాటు రూపంలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ఇప్పటివరకు ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా పూర్తిగా నిమగ్నమై ఉండటంతో నాటోతో నేరుగా ఘర్షణకు దిగేందుకు పుతిన్ వెనుకాడతారని అమెరికా భావించింది. అయితే రష్యాపై పెరుగుతున్న ఒత్తిడి, ఉక్రెయిన్ చేపడుతున్న డ్రోన్ దాడులు, యుద్ధంలో రష్యా ఎదుర్కొంటున్న సవాళ్లు వంటి పరిణామాల నేపథ్యంలో అమెరికా అంచనాల్లో మార్పు వచ్చినట్లు నివేదిక పేర్కొంది.
రష్యా నాటో సభ్యదేశంపై ఏదైనా దాడికి పాల్పడితే అది నాటో ఒప్పందంలోని ఆర్టికల్ 5 కారణంగా తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. అందువల్ల పుతిన్ ప్రభుత్వం ప్రత్యక్ష యుద్ధానికి బదులుగా పరిమిత సైనిక చర్యలు, సైబర్ దాడులు లేదా రహస్య ఆపరేషన్ల ద్వారా నాటో ప్రతిస్పందనను పరీక్షించే అవకాశంపై అమెరికా నిఘా వర్గాలు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.