ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన బీఆర్ఎస్ నాయకుడు, స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పార్టీ అధినేత కేసీఆర్ అండగా నిలిచారు. పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం పెద్ది కుటుంబానికి పార్టీ తరఫున మొత్తం రూ.2.25 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని కేసీఆర్ నిర్ణయించారు.
ఈ ఆర్థిక సాయంలో భాగంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం చెరో రూ.కోటి చొప్పున మొత్తం రూ.2 కోట్లు కేటాయించారు. అలాగే వృద్ధాప్యంలో ఉన్న ఆయన తల్లి అమృతమ్మ బాగోగుల కోసం మరో రూ.25 లక్షలను ఆమె పేరుతో బ్యాంకులో జమ చేయాలని ఆదేశించారు. కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు పిల్లల చదువులు, కుటుంబ సంక్షేమాన్ని పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తుందని కేసీఆర్ హామీ ఇచ్చారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి దశదినకర్మ పూర్తయిన అనంతరం జిల్లా పార్టీ ముఖ్య నేతలు సమావేశమై కుటుంబానికి అవసరమైన మరిన్ని సంక్షేమ కార్యక్రమాలపై నిర్ణయం తీసుకుంటారని కేసీఆర్ తెలిపారు. పెద్ది కుటుంబానికి భవిష్యత్తులోనూ బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.