ప్రపంచ తల్లిపాల వారోత్సవం.. తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పడకల్ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ డోకూరి సునీత ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి తల్లి తన శిశువుకు పుట్టిన తొలి ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే అందించాలని సూచించారు. తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయని, తల్లి-బిడ్డ ఆరోగ్య పరిరక్షణలో వాటి పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. అలాగే తల్లులకు పోషకాహారం, శిశు సంరక్షణపై పలు సూచనలు చేస్తూ అవగాహన కల్పించారు.

అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు అంతుల్ బేగం, సమంత, గ్రామపంచాయతీ కార్యదర్శి రమాదేవి, వార్డు సభ్యులు వాజీద్, లట్టుపల్లి వసంతతో పాటు గర్భిణీలు, బాలింతలు, తల్లులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.