ఇందిరమ్మ చీరలు గోదాముల్లోనే.. మహిళలకు ఇవ్వకుండా ఎలుకల పాలు చేస్తున్నారని కృశాంక్ ఆరోపణలు

మహిళలకు పంపిణీ చేయాల్సిన ఇందిరమ్మ చీరలను లబ్ధిదారులకు అందించకుండా గోదాముల్లో నిల్వ ఉంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నే కృశాంక్ ఆరోపించారు. గత నవంబర్‌లో పంపిణీ చేయాల్సిన చీరలను మహిళా సంఘాలకు ఇవ్వకుండా కంటోన్మెంట్ వర్క్‌షాప్ గోదాములో వేల సంఖ్యలో నిల్వ ఉంచి ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ఆయన విమర్శించారు.

ప్రభుత్వం కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తామని ప్రకటించినప్పటికీ, తొమ్మిది నెలలు గడిచినా కంటోన్మెంట్ పరిధిలోని మహిళలకు ఇప్పటికీ చీరలు అందలేదని కృశాంక్ పేర్కొన్నారు. మహిళలకు అందాల్సిన చీరలు గోదాముల్లోనే ఉండిపోవడం వల్ల అవి పాడయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు.

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఏడాది దసరాకు ముందే బతుకమ్మ చీరలను మహిళలకు పంపిణీ చేసేవారని గుర్తుచేసిన కృశాంక్, ప్రస్తుతం ఇందిరమ్మ చీరలను గోదాముల్లో ఎందుకు నిల్వ ఉంచారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే, కంటోన్మెంట్ అధికారులు ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన కోరారు.