పల్నాడు జిల్లా దాచేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగింది. ఈ దీక్షలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పాల్గొని రాష్ట్ర ప్రభుత్వంపై పలు డిమాండ్లు చేశారు. డీఎస్సీ నియామకాలలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ వ్యవహారానికి పూర్తి బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని కాసు మహేష్ రెడ్డి కోరారు. విద్యార్థులకు బకాయి ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అదేవిధంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. నిరుద్యోగులకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఆడబిడ్డ నిధి అందిస్తామని ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని వైసీపీ నేతలు తెలిపారు.