జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మదనపల్లెలో ర్యాలీ.. చేనేత రంగానికి మరింత ప్రోత్సాహం ఇవ్వాలని విజ్ఞప్తి

జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర ఆధ్వర్యంలో గురువారం ఘనంగా ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు చేనేత కార్మికులు, కూటమి నాయకులు, జనసేన కార్యకర్తలు కలిసి ర్యాలీ నిర్వహిస్తూ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం సబ్ కలెక్టర్‌తో పాటు చేనేత శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌ను కలిసి చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందించాలని వినతిపత్రం సమర్పించారు. చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు, చేనేత కార్మికులు, వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేనేత రంగ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరింత చొరవ చూపాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.