ప్రఖ్యాత శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత శోభారాజు మంగళవారం ఉండవల్లిలోని నివాసంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలుగు భక్తి సంగీత సంప్రదాయం, సనాతన ధర్మ ప్రచారం, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ వంటి పలు అంశాలపై ఇరువురూ చర్చించారు. తెలుగు సంగీత, సాంస్కృతిక సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరంపై కూడా చర్చ జరిగినట్లు తెలిపారు.
సమావేశంలో భాగంగా శోభారాజు.. పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల చిత్రపటాన్ని మంత్రి నారా లోకేష్‌కు జ్ఞాపికగా అందజేశారు. అన్నమాచార్యుల కీర్తనలు, తెలుగు భక్తి సంగీతానికి ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తెలుగు భక్తి సంగీత సంప్రదాయాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై కూడా అభిప్రాయాలు పంచుకున్నారు.
అనంతరం మంత్రి నారా లోకేష్ శ్రీవారి ప్రతిమను శోభారాజుకు బహుకరించి ఘనంగా సత్కరించారు. తెలుగు సాహిత్యం, సంగీతం, సంస్కృతికి విశేష సేవలందిస్తున్న ప్రముఖులను గౌరవించడం ద్వారా సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు ప్రోత్సాహం లభిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.