స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘హర్ ఘర్ తిరంగా’ యాత్రను నిర్వహిస్తున్నట్లు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి తెలిపారు. ఆగస్టు 10 నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రంలోని జిల్లా, మండల స్థాయిల్లో హర్ ఘర్ తిరంగా ర్యాలీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 10న రాష్ట్రవ్యాప్తంగా ప్రతి బీజేపీ కార్యకర్త తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, ఆటో స్టాండ్ల వద్ద జాతీయ జెండాలను పంపిణీ చేయనున్నట్లు శిల్పారెడ్డి తెలిపారు. విద్యార్థులకు జాతీయ జెండా ప్రాముఖ్యత, దేశభక్తి, స్వాతంత్ర్య ఉద్యమ విలువలను వివరించేలా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. అలాగే హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా పద్మ అవార్డీలు, ప్రముఖులను కలిసి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఆగస్టు 14న హైదరాబాద్లో సుమారు 30 వేల మందితో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించనున్నట్లు శిల్పారెడ్డి తెలిపారు. జాతీయ జెండా విలువ, దాని ప్రాధాన్యత ప్రతి ఒక్కరికీ తెలిసేలా రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీజేపీ మహిళా మోర్చా శ్రేణులు సిద్ధమవుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.