Commonwealth Games 2026: 39 పతకాలతో నాలుగో స్థానంలో భారత్.. ఆస్ట్రేలియా టాప్

గ్లాస్గో కామన్వెల్త్ క్రీడలు ఆదివారంతో ముగిశాయి. ఆఖరి రోజున భారత అథ్లెట్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. జూడో, సైక్లింగ్ విభాగాల్లో ఏడుగురు భారత క్రీడాకారులు పోటీపడినప్పటికీ.. ఒక్కరు కూడా పతకం సాధించలేకపోయారు. దీంతో భారత్ ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో మొత్తం 39 పతకాలతో తన ప్రస్థానాన్ని ముగించింది.

భారత్ ఖాతాలో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలు ఉన్నాయి. అయితే 2022లో బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఏకంగా 61 పతకాలు సాధించింది. దీంతో గతంతో పోలిస్తే ఈసారి భారత పతకాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఆఖరి రోజు పతకాలు రాకపోవడంతో భారత బృందం మరిన్ని పతకాలు సాధించే అవకాశం కోల్పోయింది.

పతకాల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలిచింది. ఆ దేశం ఏకంగా 171 పతకాలు సాధించి టాప్‌లో నిలవగా.. భారత్ 39 పతకాలతో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. మొత్తంగా చూస్తే భారత అథ్లెట్లు పలు విభాగాల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచినప్పటికీ, గత కామన్వెల్త్ క్రీడలతో పోలిస్తే పతకాల సంఖ్య తగ్గడం నిరాశ కలిగించే అంశంగా మారింది.