Helicopter Crash: గాల్లోనే రెండు హెలికాప్టర్లు ఢీ.. గ్రీస్‌లో ఫైర్‌ఫైటింగ్ ఆపరేషన్‌లో విషాదం

గ్రీస్‌లో తీవ్రమైన ఎండలు, ఈదురుగాలుల కారణంగా అడవుల్లో వేగంగా వ్యాపిస్తున్న దావానలాన్ని అదుపు చేసేందుకు చేపట్టిన ఫైర్‌ఫైటింగ్ ఆపరేషన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రాజధాని ఏథెన్స్‌కు పశ్చిమంగా మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో రెండు హెలికాప్టర్లు గాల్లోనే పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

ఏథెన్స్‌కు సుమారు 60 కిలోమీటర్ల దూరంలోని పోర్టో జెర్మెనో సమీపంలోని పసాథా ప్రాంతంలో అడవుల్లో మంటలు చెలరేగాయి. వాటిని అదుపులోకి తీసుకురావడానికి ఫైర్‌ఫైటింగ్ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో రెండు హెలికాప్టర్లు నియంత్రణ కోల్పోయి గాల్లోనే ఢీకొన్నాయి. దీంతో ఒక హెలికాప్టర్‌కు మంటలు అంటుకుని కిందపడిపోయింది. మరో హెలికాప్టర్ మాత్రం అత్యవసరంగా ల్యాండ్ కావడంతో అందులోని సిబ్బంది ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది.

ప్రమాదానికి సంబంధించిన భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారీ మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.