ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో నదీపాయల్లో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం గంటి పెదపూడి లంక వద్ద నదీపాయను దాటేందుకు ఏర్పాటు చేసిన తాత్కాలిక మట్టి గట్టు వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో సమీపంలోని నాలుగు లంక గ్రామాల ప్రజల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
వరద ఉధృతికి తాత్కాలిక రహదారి కొట్టుకుపోవడంతో ఆయా గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. భారీ వర్షాలు, వరద ప్రవాహం మరింత పెరిగితే పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి ఏడాది వర్షాకాలం ముగిసిన తర్వాత పంటల రవాణా, గ్రామస్థుల రాకపోకల కోసం ఈ నదీపాయపై తాత్కాలికంగా మట్టి గట్టును ఏర్పాటు చేసుకుంటారు. అయితే వర్షాకాలంలో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వచ్చే వరద నీటి ఒత్తిడిని ఈ గట్టు తట్టుకోలేక తరచూ తెగిపోతుంటుంది. శాశ్వత పరిష్కారం చూపాలని లంక గ్రామాల ప్రజలు అధికారులను కోరుతున్నారు.