సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం ఏపూరు తండా గ్రామ పంచాయతీలో కొత్త పంచాయతీ భవనం నిర్మాణం వివాదానికి దారితీసింది. భవనాన్ని ఏ ప్రాంతంలో నిర్మించాలనే అంశంపై బోడతండా, మాన్య తండా వాసులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో స్థానికంగా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
బోడతండా, మాన్య తండాలు కలిసి ఏపూరు తండా గ్రామ పంచాయతీగా ఏర్పడ్డాయి. గతంలో పంచాయతీ భవనం నిర్మాణం కోసం మాజీ సర్పంచ్ ముకుంద మాన్య తండాలో మూడు గుంటల భూమిని విరాళంగా ఇచ్చినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఆ ప్రతిపాదనను పక్కనపెట్టి, పంచాయతీ భవనాన్ని తన స్వగ్రామమైన బోడతండాలోనే నిర్మించాలని ప్రస్తుత సర్పంచ్ జయరాజు నిర్ణయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ అంశంపై రెండు తండాల ప్రజలు తమ తమ వాదనలు వినిపిస్తూ పట్టుబడుతుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమస్య మరింత ముదరకుండా అధికారులు జోక్యం చేసుకుని, ఇరు వర్గాలతో చర్చలు జరిపి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు.