నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు రైతులు, పశువుల కాపరులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. కడెం మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో భారీ వర్షాల కారణంగా ఓ పశువుల కొట్టం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో కొట్టంలో ఉన్న ఎద్దుకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
చిన్న బెల్లాల్ పంచాయతీ పరిధిలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రైతు కందుల తిరుపతికి చెందిన పశువుల కొట్టం వర్షాల ధాటికి కూలిపోయింది. ప్రమాద సమయంలో కొట్టంలో ఉన్న ఎద్దుపై శిథిలాలు పడటంతో దాని కొమ్ము విరిగిపోయి తీవ్ర రక్తస్రావం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం మూగజీవం తీవ్ర వేదనతో బాధపడుతోంది.
జీవనాధారమైన పశువుల కొట్టం కూలిపోవడంతో పాటు ఎద్దుకు గాయాలు కావడంతో రైతు కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. అధికారులు వెంటనే స్పందించి పశువుకు వైద్య చికిత్స అందించడంతో పాటు నష్టపరిహారం మంజూరు చేసి ఆదుకోవాలని రైతు కుటుంబం విజ్ఞప్తి చేసింది.