రూ.100 కోట్లకు పైగా ఆదాయం చూపిన వారి సంఖ్య భారీగా పెరుగుదల.. పార్లమెంట్‌లో కేంద్రం వెల్లడి

భారత్‌లో అత్యధిక ఆదాయం ప్రకటిస్తున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య గత ఐదేళ్లలో గణనీయంగా పెరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంట్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం, అసెస్‌మెంట్ ఇయర్ (AY) 2025-26 నాటికి వార్షికంగా రూ.100 కోట్లకు పైగా ఆదాయం ప్రకటించిన వారి సంఖ్య 576కు చేరుకుంది. గత ఏడాది ఈ సంఖ్య 415గా ఉండగా, ఐదేళ్ల క్రితం ఇది కేవలం 142 మాత్రమే ఉండటం విశేషం.

కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ గణాంకాలను వెల్లడించారు. AY 2021-22లో 142 మంది ఉండగా, AY 2022-23లో 301కు పెరిగింది. అనంతరం AY 2023-24లో 284కు తగ్గినా, AY 2024-25లో 415కు, AY 2025-26లో 576కు చేరిందని తెలిపారు. దీంతో గత ఐదేళ్లలో ఈ వర్గానికి చెందిన పన్ను చెల్లింపుదారుల సంఖ్య 300 శాతానికి పైగా పెరిగినట్లు వెల్లడైంది.

అయితే ‘బిలియనీర్’ అనే పదానికి భారత చట్టాల్లో ఎలాంటి అధికారిక నిర్వచనం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టాల ప్రకారం రూ.100 కోట్లకు పైగా ఆదాయాన్ని ఐటీఆర్‌లో ప్రకటించిన వారినే ఈ గణాంకాల్లో పరిగణించినట్లు మంత్రి వివరించారు. అలాగే, 2016లో వెల్త్-ట్యాక్స్ చట్టం రద్దైన తర్వాత వ్యక్తుల మొత్తం ఆస్తులకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం సేకరించడం లేదని కూడా వెల్లడించారు.