జంగాలపల్లిలో కార్డన్ సెర్చ్.. 30 బైక్‌లు, 2 ఆటోలు స్వాధీనం

నెల్లూరు జిల్లా జంగాలపల్లిలో కలిగిరి సీఐ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత స్థాయిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని పలు ప్రాంతాల్లో వాహనాలు, అనుమానిత వ్యక్తులను తనిఖీ చేస్తూ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణే లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు సమర్పించాలని యజమానులకు సూచించిన అధికారులు, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అనంతరం గ్రామస్థులకు సైబర్ నేరాలు, గంజాయి వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆన్‌లైన్ మోసాల నుంచి అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద సంఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రజలకు సూచించారు.