దళిత క్రైస్తవుల హక్కుల కోసం ఆగస్టు 10న ‘చలో ఢిల్లీ’ పిలుపు

దళిత క్రైస్తవుల హక్కుల సాధన కోసం ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 10న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిటీ గౌరవ అధ్యక్షుడు సంగటి మనోహర్ మహాజన్, వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు సంగటి చిన్న యోసేపు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా దళిత క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో కమిటీ గౌరవ అధ్యక్షుడు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ఆవిష్కరించారు. మహా ధర్నాను విజయవంతం చేసి దళిత క్రైస్తవుల సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బిషప్ సంజయ్ ఆనంద్ మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించేలా చట్టంలో తగిన సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యాంగబద్ధమైన హక్కులు, సామాజిక న్యాయం అందరికీ సమానంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.