శారదా నదిపై ఎల్లయ్య గ్రోయిన్ ప్రారంభం.. 1,500 ఎకరాలకు సాగునీటి భరోసా

అనకాపల్లి నియోజకవర్గ రైతులకు సాగునీటి భద్రత కల్పించే దిశగా కీలక ముందడుగు పడింది. ఎన్నికల హామీ మేరకు శారదా నదిపై తుమ్మపాల గ్రామం సమీపంలోని ఎల్లయ్య గ్రోయిన్ మరమ్మత్తు పనులు పూర్తి చేసి శనివారం ప్రారంభించారు. డీఎంఎఫ్‌టీ (DMFT) నిధులతో రూ.1.19 కోట్ల వ్యయంతో ఈ పనులను చేపట్టారు.

ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1,500 ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందే అవకాశం ఏర్పడింది. దీంతో రైతులకు సాగునీటి సమస్య కొంతవరకు పరిష్కారం కానుందని అధికారులు తెలిపారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ పాల్గొని ఎల్లయ్య గ్రోయిన్‌ను ప్రారంభించారు. అనంతరం శారదా నదికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.