నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని గోసంపల్లె గ్రామంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను అభిమానులు వినూత్నంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కొక్కుల సుభద్ర ఆధ్వర్యంలో వ్యవసాయ పొలంలో పచ్చని వరి నాట్లతో ఆంగ్ల అక్షరాల్లో “KTR” అనే పేరు వచ్చేలా ప్రత్యేకంగా నాట్లు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
అనంతరం గ్రామస్థులు కేక్ కట్ చేసి కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రైతుల పట్ల కేటీఆర్ చూపుతున్న మద్దతు, రైతు సంక్షేమం కోసం చేస్తున్న కృషికి గుర్తుగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సర్పంచ్ కొక్కుల సుభద్ర తెలిపారు. ఈ వినూత్న వేడుక స్థానికంగా ఆకట్టుకుంది.
“రైతు గుండెల్లో కేటీఆర్.. పచ్చని పొలంలో ‘KTR'” అనే సందేశంతో గ్రామస్థులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ బీఆర్ఎస్ శ్రేణులను ఆకర్షిస్తున్నాయి.