మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామంలో పర్యటించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మాజీ ఎంపీటీసీ యాదయ్య కుమారుడికి నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చి వారికి ధైర్యం చెప్పారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దేశంలోని తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్ట్‌ను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే లడఖ్‌కు చెందిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షను భగ్నం చేయడంపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన ప్రభుత్వాలే వారిపై లాఠీచార్జ్‌కు పాల్పడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కోమటిరెడ్డి అన్నారు. ప్రజల సమస్యలను అణచివేయకుండా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో పరిష్కరించాలని ప్రభుత్వాలను ఆయన కోరారు.