ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్ ఆస్తి వేలం వ్యవహారంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రుణ వ్యవహారంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న చర్యలను సవాలు చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. బకాయిలన్నీ చెల్లించిన తర్వాత కూడా బ్యాంక్ తన ఆస్తులను వేలం వేసిందని పిటిషన్లో పేర్కొన్నారు.
హైదరాబాద్‌కు చెందిన మెస్సర్స్ శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు యూనియన్ బ్యాంక్ అందించిన రుణాలకు బండ్ల గణేశ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు గ్యారెంటర్లుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ సొంత ఆస్తులను పూచీకత్తుగా బ్యాంక్ వద్ద తాకట్టు పెట్టినట్లు వివరించారు.
అయితే కంపెనీ దివాలా పరిష్కార ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో తనఖా పెట్టిన ఆస్తిని బ్యాంక్ వేలం వేసిందని బండ్ల గణేశ్ ఆరోపించారు. ఈ చర్య చట్టవిరుద్ధమని పేర్కొంటూ బ్యాంక్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో న్యాయపరమైన పోరాటం ప్రారంభించారు.