ఏపీలో రెండో దశ జాబ్ క్యాలెండర్‌కు కసరత్తు.. నియామకాల ప్రక్రియ వేగవంతం

ఆంధ్రప్రదేశ్‌లో రెండో దశ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ జాబ్ క్యాలెండర్ రూపకల్పన ప్రక్రియ వేగం పుంజుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో కార్యదర్శులు, శాఖాధిపతులతో కలిసి నియామకాల విధివిధానాలపై సమీక్ష నిర్వహించారు. భర్తీ చేయాల్సిన పోస్టుల నోటిఫికేషన్లు, ఈ-హెచ్‌ఆర్‌ఎం ప్రక్రియ, స్థానిక కేడర్ వ్యవస్థకు అనుగుణంగా నియామకాలపై చర్చించారు.

కొత్త స్థానిక కేడర్లలో పోస్టుల కేటాయింపు, సీనియారిటీ జాబితాల ఖరారు, రోస్టర్ల సిద్ధీకరణ, అభ్యర్థుల కేటాయింపు, నియామక సంస్థలకు ఇండెంట్లు పంపడం వంటి అంశాలను అధికారులు సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎస్‌.ఎస్‌. రావత్‌, బి. రాజశేఖర్‌, కృష్ణబాబు, జి. జయలక్ష్మి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

త్వరలోనే రెండో దశ జాబ్ క్యాలెండర్‌కు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. కాగా, ఈ ఏడాది మార్చి 19న రాష్ట్ర ప్రభుత్వం 10,060 పోస్టుల భర్తీకి తొలి జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో దశ నియామకాల కోసం ప్రభుత్వం వేగంగా కసరత్తు ప్రారంభించింది.