మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటిస్తున్న 41వ చిత్రానికి ఎట్టకేలకు అధికారికంగా ‘శ్రీశ్రీ’ అనే టైటిల్‌ను ప్రకటిస్తూ చిత్రబృందం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు రవి నెలకుడితి దర్శకత్వం వహిస్తున్నారు. దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే తొలిసారి జంటగా నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేమకథా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘Love Will Spark Again’ అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పోస్టర్లో దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ఇద్దరూ కాంపౌండ్ గోడపై కూర్చొని చిరునవ్వులతో కనిపించడం ప్రేమకథపై ఆసక్తిని పెంచుతోంది. దుల్కర్ లైట్ బ్లూ షర్ట్, గ్రే ట్రౌజర్స్, కళ్లద్దాలతో క్లాసిక్ లుక్‌లో కనిపించగా, పూజా హెగ్డే లైట్ బ్లూ సల్వార్ సూట్లో సింపుల్‌గా మెరిశారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో రూపొందించిన పోస్టర్‌కు అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
టెక్నికల్ పరంగా కూడా ఈ చిత్రానికి అనుభవజ్ఞులైన బృందం పనిచేస్తోంది. అనయ్ ఓం గోస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్‌ను అవినాష్ కొల్లా నిర్వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘శ్రీశ్రీ’ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. తొలి పోస్టర్‌తోనే ప్రేమకథల్ని ఇష్టపడే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.