అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో సంబంధాలపై కీలక ప్రకటన చేశారు. అమెరికాతో చర్చలు కొనసాగించాలని ఇరాన్ కోరిందని, అందుకు తాము అంగీకరించినప్పటికీ ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ముగిసిందని స్పష్టం చేశారు. ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టులో ఈ విషయాన్ని వెల్లడించిన ట్రంప్, “ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ మమ్మల్ని చర్చలు కొనసాగించాలని కోరింది. మేము అందుకు అంగీకరించాం. అయితే కాల్పుల విరమణ ముగిసిందని వారికి స్పష్టంగా తెలియజేశాం” అని పేర్కొన్నారు. ఈ ప్రకటనపై ఇరాన్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
అమెరికా, ఇరాన్ మధ్య ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. హోర్ముజ్ జలసంధిలో మూడు వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతీకారంగా అమెరికా ఇరాన్ లక్ష్యాలపై దాడులు చేపట్టినట్లు సమాచారం. ఈ ఘటనలకు ఇరాన్ వైఖరే కారణమని అమెరికా ఆరోపిస్తోంది.
అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ కువైట్, బహ్రెయిన్ ప్రాంతాల్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. మరోవైపు చాబహార్ పోర్టు పరిసరాలు, ఇతర వ్యూహాత్మక ప్రాంతాలతో పాటు పలు ఇరాన్ సైనిక స్థావరాలపై కూడా అమెరికా దాడులు కొనసాగించినట్లు సమాచారం. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.