ఎల్‌పీజీ వినియోగదారుల కోసం ఇటీవల పలు కీలక నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా ఇల్లు లేదా నగరం మారేవారు, అలాగే పైపుల ద్వారా సరఫరా అయ్యే సహజ వాయువు (PNG)కు మారాలని భావిస్తున్నవారు ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు. లేకపోతే గ్యాస్ కనెక్షన్ బదిలీలో ఆలస్యం కావడం లేదా కొన్ని సందర్భాల్లో కనెక్షన్ నిలిపివేయబడే అవకాశం ఉండొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇల్లు మారే ముందు వినియోగదారులు తమ గ్యాస్ ఏజెన్సీకి సమాచారం అందించి, కనెక్షన్ బదిలీ కోసం దరఖాస్తు చేయాలి. ఇందుకోసం గుర్తింపు పత్రం, కొత్త చిరునామా రుజువు, గ్యాస్ బుకింగ్ వివరాలు, కనెక్షన్ వోచర్ వంటి అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అయితే అదే గ్యాస్ ఏజెన్సీ సేవా పరిధిలోని మరో ఇంటికి మారుతున్నట్లయితే కనెక్షన్‌ను బదిలీ చేయాల్సిన అవసరం లేదు. చిరునామాను మాత్రమే అప్‌డేట్ చేయించుకుంటే సరిపోతుంది.
గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండాలంటే ఇల్లు మారే ప్రక్రియ ప్రారంభించే ముందే అవసరమైన అన్ని వివరాలను ఏజెన్సీకి అందించడం మంచిది. నిబంధనల ప్రకారం కనెక్షన్ వివరాలను సకాలంలో నవీకరించుకోవడం ద్వారా సిలిండర్ సరఫరా నిరంతరంగా కొనసాగడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నివారించుకోవచ్చు.