ప్రపంచ వింతల్లో ఒకటైన ఆగ్రాలోని తాజ్ మహల్ ప్రాంగణంలో ‘తేజో మహాలయ’ ఆలయం ఉందంటూ దాఖలైన రిట్ పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హరి శంకర్ జైన్‌తో పాటు మరో నలుగురు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం, వివాదాస్పద ప్రాంగణంలో సర్వే, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ కోసం అడ్వకేట్ కమిషనర్‌ను నియమించే అంశంపై తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)కు నోటీసులు జారీ చేసింది.
పిటిషనర్ల తరఫున న్యాయవాదులు, తాజ్ మహల్ నిర్మాణ శైలి, అంతర్గత లక్షణాలను శాస్త్రీయంగా పరిశీలించి నమోదు చేయడం అవసరమని కోర్టుకు విన్నవించారు. ఇలాంటి చారిత్రక వివాదాల్లో కేవలం మౌఖిక సాక్ష్యాలు సరిపోవని, శాస్త్రీయ ఆధారాలు అవసరమని పేర్కొన్నారు. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ, అవసరమైతే అడ్వకేట్ కమిషనర్‌ను నియమించే అధికారం న్యాయస్థానాలకు ఉందని వివరించారు.
ఈ వివాదానికి దశాబ్దకాల చరిత్ర ఉంది. 2015లో మొదటిసారిగా ఆగ్రా సివిల్ కోర్టులో దావా దాఖలుకాగా, అనంతరం సర్వే కోరిన పిటిషన్లను దిగువ కోర్టులు తిరస్కరించాయి. స్థానిక విచారణ అవసరమా అనే అంశాన్ని సరిగా పరిశీలించలేదని పిటిషనర్లు ఆరోపించడంతో విషయం ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు ముందుకు వచ్చింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, ఏఎస్ఐ స్పందన అనంతరం తదుపరి విచారణ కొనసాగనుంది.