మెల్‌బోర్న్‌లో వైఎస్సార్ 75వ జయంతి వేడుకలు.. ఘనంగా నివాళులర్పించిన ప్రవాస తెలుగు ప్రజలు

 

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో వైఎస్సార్‌సీపీ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి తెలుగు కుటుంబాలు, యువత, పార్టీ కార్యకర్తలు, అభిమానులు హాజరై వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు సాంబశివ రెడ్డి, నూర్ ఫాతిమా జూమ్ ద్వారా పాల్గొని తమ సందేశాలను అందించారు.

ఈ సందర్భంగా వైఎస్సార్ ముఖ్యమంత్రిగా అమలు చేసిన ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి సంక్షేమ పథకాలను నాయకులు గుర్తు చేసుకున్నారు. రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళలు, వృద్ధుల సంక్షేమానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. వైఎస్సార్ ఆశయాలను భావితరాలకు చేరవేయడం ప్రతి కార్యకర్త బాధ్యత అని, ప్రజా సంక్షేమమే పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు.

కార్యక్రమ నిర్వహణలో వైఎస్సార్‌సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ భరత్ రెడ్డి, మెల్‌బోర్న్ కన్వీనర్ కృష్ణ రెడ్డి, కో-కన్వీనర్ రామాంజి కీలక పాత్ర పోషించారు. కోర్ టీమ్ సభ్యులు, యువజన విభాగం కార్యకర్తలు ఏర్పాట్లలో పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన వారితో పాటు ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్న నాయకులు, మద్దతు తెలిపిన ప్రవాస తెలుగు కుటుంబాలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.