ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాపై తమిళనాడులో వివాదం.. పోస్టర్‌పై సీమాన్ అభ్యంతరం

 

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న కొత్త సినిమా అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే వివాదంలో చిక్కుకుంది. నిర్మాత నాగ వంశీ విడుదల చేసిన ప్రచార పోస్టర్‌లో “ఉత్తరాదిన జన్మించి.. దక్షిణాదిన పూజలందుకున్న” అనే భావన కలిగించే వాక్యాలు ఉండటంపై తమిళనాడులో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టర్‌లో కుమారస్వామిని సూచించే సంకేతాలు ఉండటంతో, ఆయన పుట్టుకను ఉత్తరాదితో ముడిపెట్టడం తమిళ సంస్కృతి, చరిత్రను వక్రీకరించడమేనని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ వివాదంపై ‘నామ్ తమిళర్ కచ్చి’ అధినేత సీమాన్ తీవ్రంగా స్పందించారు. కుమారస్వామి తమిళుల ఆరాధ్య దైవమని, ఆయనను తమిళ సంస్కృతి నుంచి వేరు చేయలేమని పేర్కొంటూ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేయకుండా ప్రభుత్వం అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. కళ పేరుతో చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరిస్తూ, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.

ఇప్పటివరకు ఈ వివాదంపై హీరో ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లేదా నిర్మాత నాగ వంశీ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. సినిమా ఇంకా నిర్మాణ దశకు చేరుకోకముందే ఈ వివాదం తెరపైకి రావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో కళాత్మక స్వేచ్ఛ, సంస్కృతి, చరిత్ర పట్ల గౌరవం వంటి అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, ఈ వివాదంపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది.