సీసీటీవీ కెమెరాలతో నేరాల నియంత్రణకు ప్రజల సహకారం అవసరం: ఎల్‌బీ నగర్ ఏసీపీ

 

నేరాల నియంత్రణ, నేరాల పరిశోధనలో సీసీటీవీ కెమెరాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఎల్‌బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య తెలిపారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు చేపట్టిన “నేను సైతం 2.0” కార్యక్రమంలో భాగంగా నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారం డబుల్ బెడ్‌రూమ్ గేటెడ్ కమ్యూనిటీలో నివాసితులు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసిన 54 సీసీటీవీ కెమెరాలను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏసీపీ కృష్ణయ్య మాట్లాడుతూ, సీసీటీవీ కెమెరాలు నేరాల నివారణతో పాటు నేరస్థుల గుర్తింపు, దర్యాప్తులో కీలక ఆధారాలుగా ఉపయోగపడుతున్నాయని అన్నారు. ప్రజలు తమ సొంత నిధులతో నివాస ప్రాంతాల్లో కెమెరాలను ఏర్పాటు చేయడం సమాజ భద్రతకు ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రతి కాలనీ, అపార్ట్‌మెంట్, వ్యాపార సంస్థలు సీసీటీవీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో నాగోల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీ, ఎస్‌ఐ శివ నాగ ప్రసాద్, మాజీ కౌన్సిలర్ దేవిడి వేణుగోపాల్ రెడ్డి, బ్లాక్ ఇన్‌చార్జ్‌లు రిజ్వాన్, భాస్కర్, దేవేందర్, మొహమ్మద్ ఖాతీజా బేగం తదితరులు పాల్గొన్నారు.