ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో కలిసి ఎస్ఐఆర్ పురోగతిని సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 25 నుంచి ప్రారంభమైన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ తుది దశకు చేరుకుందని తెలిపారు.
ఓటర్లు సమర్పించిన ఫారాలను సేకరించి, బీఎల్ఓ యాప్‌లో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఈ నెల 20వ తేదీలోపు డిజిటలైజేషన్ పూర్తి చేయాలని సుదర్శన్ రెడ్డి సూచించారు. అలాగే ఓటర్లకు ఫారాలు నింపడంలో వాలంటీర్ల సహకారం అందించాలని, డిజిటలైజేషన్ పూర్తైన తర్వాత పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ చేపట్టాలని ఆదేశించారు. తప్పుడు సమాచారం సమర్పించిన ఓటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లాలో ఇప్పటికే ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 99.3 శాతం పూర్తయిందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. బీఎల్ఓలకు అవసరమైన శిక్షణ అందించామని, హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశామని, నిర్ణీత గడువులోగా డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆర్డీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల శాఖ అధికారులు పాల్గొన్నారు.