న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో 8 మందికి గాయాలు

 

అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా న్యూయార్క్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. ప్రముఖ కోనీ ఐలాండ్ (Coney Island) బీచ్ సమీపంలో నిర్వహించిన కుటుంబ కుక్‌అవుట్ కార్యక్రమంలో గుర్తుతెలియని వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఎనిమిది మంది గాయపడ్డారు.

పోలీసుల వివరాల ప్రకారం.. గాయపడిన వారిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. 21 ఏళ్ల యువతి పరిస్థితి విషమంగా ఉండగా, మిగిలిన బాధితుల పరిస్థితి నిలకడగా ఉందని న్యూయార్క్ పోలీస్ కమిషనర్ జెస్సికా టిస్చ్ తెలిపారు. శనివారం రాత్రి కోనీ ఐలాండ్ బోర్డ్‌వాక్‌కు సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్ ప్రాంగణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ముఖానికి నల్లటి మాస్క్ ధరించిన దుండగుడు కుటుంబ సభ్యులు విందులో పాల్గొంటున్న సమయంలో అక్కడికి చేరుకుని కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనాస్థలంలో లభించిన తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడి కోసం గాలింపు చేపట్టడంతో పాటు కాల్పులకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.