‘రౌడీ జనార్థన’లో స్పెషల్ సాంగ్.. విజయ్ దేవరకొండతో మళ్లీ అనన్య పాండే?

 

రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రణబాలి’ చిత్రంలో నటిస్తున్నారు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రౌడీ జనార్థన’ చిత్ర షూటింగ్ కూడా వేగంగా సాగుతోంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది.

తాజాగా ‘రౌడీ జనార్థన’కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేక గీతం ఉండనుందని, అందులో నటించేందుకు బాలీవుడ్ నటి అనన్య పాండేను చిత్రబృందం ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తొలుత ఈ పాట కోసం ప్రీతి ముకుందన్ పేరు వినిపించినప్పటికీ, చివరికి అనన్య పాండేనే ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

ఈ వార్తతో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. విజయ్ దేవరకొండ, అనన్య పాండే గతంలో కలిసి నటించిన ‘లైగర్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఆ సినిమా తర్వాత అనన్య తెలుగు సినిమాలకు దూరంగా ఉండగా, ఇప్పుడు మళ్లీ విజయ్‌తో కలిసి కనిపించనున్నారనే ప్రచారం అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది.

అయితే, ఈ స్పెషల్ సాంగ్‌లో అనన్య పాండే నటిస్తున్నారనే విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ వార్తపై స్పష్టత రావాల్సి ఉంది.