ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో కీలక ప్రకటన చేశారు. కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ తరహాలోనే త్వరలో కుప్పంలో కూడా బంగారు తవ్వకాలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. కుప్పాన్ని వ్యవసాయంతో పాటు పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
కుప్పం ప్రాంతానికి రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 30 కొత్త పరిశ్రమలు రానున్నాయని సీఎం వెల్లడించారు. ఈ పరిశ్రమల ద్వారా స్థానిక యువతకు సుమారు 87 వేల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. పారిశ్రామికాభివృద్ధితో పాటు ప్రాంత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
కుప్పంలో అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయం ఏర్పాటు చేయనున్నట్లు కూడా చంద్రబాబు ప్రకటించారు. రాయలసీమను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, అభివృద్ధికి ఆటంకం కలిగించే సంఘ విద్రోహ శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు.